20071029

ప్లాట్లను విక్రయించొద్దు

నెలసరి వాయిదాల చొప్పున డబ్బు వసూలు చేసి అనంతరం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుంటున్నారని బాధితులు ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఫోరం కేసును విచారణకు స్వీకరించి తుది తీర్పు వెలువడే వరకు ఆ ప్లాట్ల క్రయ, విక్రయాలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 'శ్రీ సాయిమిత్ర హౌసింగ్ కార్పొరేషన్' రియల్ ఎస్టేట్ సంస్థ హయత్‌నగర్ మండలంలోని సుర్మాయిగూడ గ్రామంలో వెంచర్ వేసి, వాయిదాల పద్ధతిన డబ్బు చెల్లిస్తే కాలపరిమితి ముగియగానే రిజిస్ట్రేషన్ చేయించి ప్లాట్లను అప్పగిస్తామని ప్రచారం చేసింది. దీంతో ఎల్లారెడ్డిగూడకి చెందిన డి. బ్రహ్మనాయుడు 2005 నవంబర్ 5న ఆ వెంచర్‌లోని 167, 168 ప్లాట్లకై తన తల్లి పేరిట రూ. 1,18,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నారు. 2007 జనవరి 9న మరో రూ. 1,52,000లు కాలపరిమితి కంటే ముందే పూర్తి మొత్తాన్ని చెల్లించారు. వాటితోపాటు అభివృద్ధి ఖర్చులకు గాను రూ.20,000లు, రిజిస్ట్రేషన్ ఖర్చులకు 15,000లు కూడా సంస్థకు ముట్టజెప్పారు. అనంతరం సంస్థ ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించింది. దీంతో ఒప్పందం ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటూ న్యాయవాది ద్వారా ఓ లీగల్ నోటీస్ పంపినప్పటికీ, సంస్థ నుంచి కాని దాని నిర్వాహకుడు కోటేశ్వర్‌రావు నుంచి కాని స్పందన రాకపోవడంతో బాధితులు రంగారెడ్డి జిల్లా ఫోరంను ఆశ్రయించారు. ఫోరం ఆ రెండు ప్లాట్లపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Labels: , ,

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖర్చు 41.76 శాతం

జీతాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వ  ఉద్యోగులు వాపోతుంటే.. ప్రభుత్వం  వారిపై పెడుతున్న ఖర్చును బాగా తగ్గించుకునే సన్నాహాల్లో ఉంది. 12వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం 2009-10కి రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో జీతాల వాటా 35 శాతానికి తగ్గాలి. 2005-06 ఆడిట్ లెక్కల ప్రకారం ఈ వాటా 41.76 శాతంగా ఉంది. ఆ ఏడాది వడ్డీ, పింఛను చెల్లింపులు కాకుండా జీతభత్యాల రూపేణా రూ.10,455 కోట్లు ఖర్చయ్యింది. జీతాల వ్యయం వాటాను ఏటా తగ్గించుకుంటూ మరో రెండేళ్లలో 35 శాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

Labels:

20071028

మహిళా సంఘాల కోసం ప్రత్యేక బ్యాంకు

మహిళ స్వయంసహాయక సంఘాలకు రుణాలను అందించడానికి ఒక బ్యాంకును ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కేంద్ర వ్యవసాయమంత్రి శరద్‌పవార్ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) మహిళల ఆర్థిక స్వయసమృద్ధి కోసం కృ షి చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు సుప్రియా సులె మహారాష్ట్రలో ఎస్‌హెచ్‌జీ ఉద్యమానికి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఎస్‌హెచ్‌జీ కార్యకలాపాలపై ప్రభుత్వ నియం త్రణ ఉండదని మంత్రి అన్నారు.

Labels: ,

చలిగాలులతో మరణానికీ బీమా

చలిగాలులతో కలిగే మరణం ప్రమాదవశాత్తు సంభవించిన మరణం కిందకే వస్తుందని జాతీయ వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. అలాంటి మరణాలకు బీమాసంస్థలు బీమా సొమ్మును నిరాకరించడం కుదరదని తేల్చిచెప్పింది. చలిగాలులు ఊహించని పరిణామాలని, ప్రణాళికతో సిద్ధంచేసి ఉంచేవి కాదని పేర్కొంది. బీహార్‌కు చెందిన రతీదేవి అనే మహిళ భర్త చలిగాలులతో మరణించడంతో ఆమె 'జాతీయ బీమా కంపెనీ లిమిటెడ్ సంస్థ' నుంచి తన భర్తకు రావాల్సిన బీమా సొమ్ముకోసం దరఖాస్తు చేశారు. చలి గాలులు ప్రమాదం కిందకు రావని బీమా సంస్థ తిరస్కరించింది. జాతీయ కమిషన్ రతీదేవి వాదనను సమర్థించి, ఆమెకు రూ.3.10 లక్షల బీమా సొమ్ము ఇవ్వాలని ఆదేశించింది.

Labels: , ,

20071027

ఐడెంటిటీ కార్డ్ ఉంటేనే రిజర్వేషన్ తో ప్రయాణం

రైల్లో రాయితీపై ప్రయాణించే సీనియర్ సిటిజన్లు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లడం తెలిసిందే.అలాగే ఇకపై రిజర్వేషన్ చేయించుకొని ప్రయాణించే వారంతా తమ ఐడెంటిటీ నిరూపించే కార్డు లేదా ఇతర ఆధారాన్ని, చిరుమానా ధ్రువీ కరణను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలంటూ ఉత్తర రైల్వే ప్రయాణికులందరికీ సూచించింది. ఒకవేళ అవి లేకుంటే, ప్రయాణికుడు వేరొకరి టికెట్‌పై ప్రయాణిస్తున్నట్లు పరిగణించి రైల్వే చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. మరొకరి పేరు మీదున్న టికెట్‌తో ప్రయాణిస్తే రూ.500 జరి మానా, మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశ ముంటుందని హెచ్చరించింది. అనధీకృత ట్రావెల్ ఏజెంట్ల మోసాలు, రద్దీ సమయాల్లో భారీగా టికెట్లు బుక్ చేసి, బ్లాక్‌లో విక్రయించే వారి ఆగడాలకు అడ్డు కట్ట వేసేందుకే ఈ ఐడెంటిటీ కార్డుల నిబంధనను పెడుతున్నట్లు తెలిపింది.

Labels: ,

20071026

ఫార్మా సంస్థలకు ఔషధ నియంత్రణశాఖ నోటీసులు

అనుమతులు లేకుండా రాష్ట్రంలో అమ్ముతున్న పలు మందును ఔషధ నియంత్రణశాఖ నిషేధించింది. రాష్ట్రంలో 33 రకాల (కాంబినేషన్ల) మందులు అనుమతులు లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామని, పది కంపెనీలు ( డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బయోలాజికల్‌ఈ, నాట్కోఫార్మా, అరబిందో ఫార్మా, కాంటెస్ట్‌ కెమికల్స్‌, సిటాడెల్‌, వ్యాన్‌గార్డ్‌, నోయల్‌ఫార్మా, టార్‌గాఫ్‌, యూనిసాన్‌క్యో కంపెనీలు) వీటిని తయారు చేస్తున్నాయని ఔషధ నియంత్రణ శాఖ డీజీ ఆర్‌.పి.మీనా చెప్పారు. ఇలాంటి మందులపై డ్రగ్స్‌, కాస్మొటిక్స్‌ చట్టం 122ఈ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మందుల్ని తయారుచేస్తున్న ఫార్మా కంపెనీలు 15 రోజుల్లోగా మార్కెట్లోని తమ ఉత్పత్తుల్ని వెనక్కు తీసుకోవాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్వరం, జలుబు వంటి సాధారణ రుగ్మతల మొదలు వివిధ జబ్బుల్ని తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్‌ మొదలైనవి ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. తాము నిర్వహించిన దాడుల్లో హైదరాబాద్‌లోనే రూ.1.41 కోట్లు, విశాఖపట్నంలో రూ.53 లక్షలు, విజయవాడ పరిధిలో రూ.2 కోట్ల విలువైన మందుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మందులకు జాతీయ ఔషధ నియంత్రణ శాఖ అనుమతులు తీసుకోకుండా ఇతర రాష్ట్రల్లో నామమాత్రపు అనుమతులు తీసుకుని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు మీనా పేర్కొన్నారు. ఇలాంటి మందులు వినియోగించే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని, కాబట్టి మందుల వాడకంలో జాగ్రత్త వహించాలని సూచించారు.

Labels: , ,

20071025

వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మూడు నెలల్లోగా వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హిందూ సాంప్రదాయంలో వివాహం చేసుకునే వారికి వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా క్రింది కోర్టు ఇచ్చిన మినహాయింపును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కుల, మత, వర్గ విచక్షణ లేకుండా వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని ఆయా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోర్టు ఆదేశించింది.

Labels: ,

రైళ్లలో సీసీ కెమెరాలు

ముంబయి రైల్వే అధికారులు సబర్బన్ రైళ్లలోని మహిళల బోగీల్లో క్లోజ్‌డ్ సర్క్యూట్ (సీసీ) కెమెరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రైల్వే పరిధిలో ప్రథమ శ్రేణి మహిళా బోగీల్లో ఆరు సి.సి. కెమెరాలను బిగించారు. ఆడ పిల్లలను వేధించే వారిపై, జేబులు కత్తిరించే వారిపై, ఇతరత్రా అల్లర్లకు పాల్పడే వారిపై కన్నేసి ఉంచేందుకు వీటిని బిగించారు. ఇవి సత్ఫలితాలిస్తే మిగతా రైళ్లలో కూడా ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తీవ్రవాదుల దాడులకు సబర్బన్ రైళ్లు ఎంత అనుకూలమో గత ఏడాది జులై 11వ తేదీన జరిగిన బాంబు పేలుళ్లు వెల్లడించాయి. దీంతో రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. చర్చి గేటు, విరార్ మధ్య ఉన్న రైల్వే స్టేషన్లన్నిటిలో సి.సి. టి.వి.లు ఏర్పాటు చేయడానికి పశ్చిమ రైల్వే అంగీకరించింది. ఇప్పటి వరకు 66 సి.సి. టి.వి.లను నెలకొల్పింది. ఇప్పుడు రైళ్ల లోపల వీటిని నెలకొల్పడం వల్ల ప్రయాణికులు, ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల విశ్వాసం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రైలు ప్రవేశ ద్వారంతో పాటు కూర్చున్న, నిలబడిన మహిళలందరినీ సి.సి. టి.వి.లు కవర్ చేస్తాయి. సెక్యూరిటీతో పాటు మహిళల మెడల్లో గొలుసులు లాక్కెళ్లడం, జేబులు కత్తిరించడం లాంటి సంఘటనలపై కూడా కన్నేసి ఉంచడానికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 15 రోజుల్లో జరిగిన సంఘటనల వివరాలన్నీ ఈ కెమెరాలు అందచేస్తాయి.

Labels: ,

జనన మరణాల వార్షిక నివేదిక

జనన మరణాల వార్షిక నివేదిక-2006ను ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి డాక్టర్ ఎ.కె.వాలియా 24.10.2007 బుధవారం విడుదల చేశారు. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఢిల్లీలో జనన, మరణాల రేటు జాతీయ స్థాయి కంటే తక్కువగా ఉంది. ఏటా ప్రతి వెయ్యి మందికి జనన రేటు జాతీయ స్థాయిలో 23.8 ఉండగా, ఢిల్లీలో 19.95 మాత్రమే నమోదయింది. మరణాల రేటు జాతీయ స్థాయిలో ఏటా వెయ్యిమంది జనాభాకు 7.6 ఉండగా ఢిల్లీలో 6.11 ఉంది. దేశంలో ప్రతిరోజూ 71812 మంది జన్మిస్తుండగా, అందులో 884 మంది ఢిల్లీలో పురుడుపోసుకొంటున్నారు. రోజూ దేశంలో 22932 మంది మరణిస్తుండగా ఢిల్లీలో 271 మంది మరణిస్తున్నారు. ఢిల్లీలో 2005లో 3.24 లక్షల జననాలు నమోదుకాగా 2006లో 3.23 లక్షలు నమోదయ్యాయి. 2006లో నమోదయిన 3.23 లక్షల జననాల్లో అబ్బాయిలు 1.76 లక్షలు ఉండగా అమ్మాయిలు 1.47 లక్షలు మాత్రమే. అంతకు ముందు ఏడాది 1.78 లక్షల మంది అబ్బాయిలు, 1.46 లక్షల మంది అమ్మాయిలు ఢిల్లీలో జన్మించారు. 2005తో పోలిస్తే 2006లో అమ్మాయిల జననాల సంఖ్య పెరిగింది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 2005లో 822 మంది అమ్మాయిలు జన్మించగా 2006లో 831కు పెరిగింది. జననాల సంఖ్య కూడా తగ్గింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు 2005లో 20.61 జననాలు నమోదుకాగా.. 2006లో 19.95కు తగ్గింది. ప్రతిరోజూ నమోదవుతున్న జననాల సంఖ్య కూడా 889 నుంచి 884కు దిగివచ్చింది. మొత్తం 78 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. అంతకు ముందు ఏడాది 74 శాతం ప్రసవాలే ఆసుపత్రుల్లో జరిగేవి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 2006లో 6.11 మరణాలు నమోదు కాగా అంతకు ముందు ఏడాది 7.6గా నమోదయ్యాయి. 2006లో 98908 మంది మరణించగా... అందులో 37 శాతం మంది 60 ఏళ్లు, అంతకన్నా వయసు పైబడిన వాళ్లు ఉన్నారు. 22 శాతం మంది 31-50 వయసుల వాళ్లు. 15 శాతం మంది 51-60 మధ్య వయస్కులు. 12 శాతం మంది 15-30 సంవత్సరాల యువకులు. 14 శాతం మంది 14 సంవత్సరాల వయసు లోపలి వాళ్లే. వీటితో పాటు 5825 శిశుమరణాలు కూడా నమోదయ్యాయి. ఇంటి వద్దే పురుడు పోసుకున్న శుశువుల్లో 60 శాతం మంది చనిపోయారు.

Labels: , ,

చెత్త మీద రూ.22 కోట్లు మిగులు

ఢిల్లీ నగరంలో చెత్త ఏరుకునేవారు ఢిల్లీ ప్రభుత్వానికి ఏటా రూ.22 కోట్లను ఆదా చేస్తున్నారని అసోఛామ్ ఐఎల్ఎఫ్ అండ్ ఎస్ ఎకోస్మార్ట్ అధ్యయనం తెలిపింది. ప్రభుత్వం సేకరించే దానికన్నా చెత్త ఏరుకునేవారే ఎక్కువగా చెత్త సేకరిస్తున్నారని, నగరంలోని సాలిడ్ వేస్ట్‌లో 17 శాతాన్ని చెత్త ఏరుకునేవారు సేకరించి, వేరు చేసి ఉచితంగా రవాణా చేస్తున్నారని అధ్యయనం తెలిపింది. ఈ అనియత చెత్త వ్యాపారం కారణంగా ప్రభుత్వానికి రోజుకు ఆరు లక్షల రూపాయలు ఆదా అవుతున్నాయని అధ్యయనం పేర్కొంది. మున్సిపల్ సాలిడ్‌వేస్ట్‌లో అధిక భాగాన్ని ఏ జాగ్రత్తలు పాటించకుండానే లోతట్టు ప్రాంతాలలో పారవేస్తున్నారని కూడా అధ్యయనంలో ఉంది. భారతదేశంలో ఉత్పత్తయే ప్లాస్టిక్ వృధాలో 40 నుంచి 80 శాతాన్ని రీసైకిల్ చేస్తున్నారని, అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రిసైక్లింగ్ రేటు 10 నుంచి 15 శాతం మాత్రమేనని అధ్యయనం తెలిపింది.

Labels: , ,

139 నెంబరుతో కాల్‌సెంటర్ రైల్వే సమాచారం

రైల్వేకు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం దక్షిణాది రాష్ట్రాలన్నిటి కోసం 139 నెంబరుతో కాల్‌సెంటర్‌ను రైల్వే ప్రారంభించింది. తమిళనాడు నుంచి ఈ కేంద్రం పనిచేస్తున్నా, నాలుగు రాష్ట్రాల పరిధిలో ఎక్కడి ప్రజలైనా కేవలం ఒక లోకల్‌కాల్‌తో తమకు కావాల్సిన సమాచారాన్ని రోజులో ఏ సమయంలోనైనా పొందే వీలుంది. అంటే 24X7 విధానంలో ఇది పనిచేస్తుంది. 'ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం' (ఐ.వి.ఆర్.ఎస్.)లోనే కాకుండా అవసరమైతే సిబ్బంది ద్వారా కూడా సమాధానాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రయాణికులు చేయాల్సిందల్లా ఏంటంటే కంప్యూటర్లో వినిపించే సులభమైన సూచనలను పాటిస్తూ పోవడమే. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విస్తారమైన సమాచారాన్ని ఈ కాల్ సెంటర్ అందిస్తుంది. సాధారణంగా రైళ్ల రాకపోకల వేళలు, బెర్తుల లభ్యత, పి.ఎన్.ఆర్. నెంబరు ఆధారంగా టికెట్ల తాజా స్థితి వంటివి తెలుసుకునేందుకు ఎక్కువమంది రైల్వే ఎంక్వయిరీకి ఫోన్ చేస్తుంటారు. 139లో ఇలాంటి వివరాలను ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా చిటికెలో ఇవ్వడమే కాకుండా వేరే స్టేషన్లకు సంబంధించిన సమాచారాన్ని సిబ్బంది ద్వారా తెలియపరుస్తారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి పుణె వెళ్లే రైళ్ల గురించి విశాఖలోని ప్రయాణికుడు తెలుసుకోవాలంటే 139 నెంబరుతో సాధ్యమే. నాగ్‌పూర్ స్టేషన్లో ఏసీ డార్మిటరీ వసతి ఉందో లేదో రాజమండ్రి ప్రయాణికుడు ఇట్టే తెలుసుకోవచ్చు. ఆయా స్టేషన్లలో ఉండే వసతి సదుపాయాలు, ప్రయాణికులకు అందుబాటులో ఉండే వసతులు, వివిధ రాయితీలు, సర్క్యులర్ టికెట్లు... ఇలా రైళ్లకు సంబంధించిన ఏ సమాచారం కావాలంటే దానిని అందించేందుకు వీలుగా 'కస్టమర్ కేర్ కాల్ సెంటర్'ను తీర్చిదిద్దారు.

Labels: ,

20071023

'కామన్‌మాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌'

'కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌'ను ప్రారంభిస్తున్నట్లు సినీ నటుడు పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకు కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలున్నాయని, వాటితో కలిసి పనిచేస్తామనీ, ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమాలు జరిగినా తాము ఉంటామని వివరించారు. సమాజ సేవ చేయడానికి రాజకీయాల తోడు అక్కర్లేదన్నారు. తను చేసేది సమాజ సేవ మాత్రమేనంటూ... రాజకీయ రంగులు
పులమవద్దన్నారు. మరో నాలుగు నెలల్లో ఈ సంస్థ చురుగ్గా పని చేస్తుందన్నారు. నా పేరు మీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ.1.32 కోట్లున్నాయి. అందులో కోటి రూపాయల్ని విరాళంగా ఇస్తున్నా. మీడియాతోనూ చేతులు కలుపుతా. మీడియా ఎన్నో మంచి పనులు చేస్తోంది. మా సాయాన్ని కూడా అందిస్తాం. మరిన్ని మంచి పనులు చేయగలుగుతాం.
నాకున్నది చాలు. ఇక ఆస్తులొద్దు. పొలాలు కొనుక్కోను. ప్రజలకు సాయం చేస్తాను. నేను ఇంత డబ్బుని తినలేకపోతున్నా. నేను చస్తే ఆరడుగులు చాలు. అందుకే నా జీవితాన్ని సంఘానికి అర్పిస్తున్నా. ఎవరికి ఎప్పుడు ఏ
అవసరమొచ్చినా నెం.32, నందగిరి హిల్స్‌, జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్ట్‌, హైదరాబాద్‌లోని నా ఇంటికి రావచ్చు. 9866344833, 9866344733 అనే నెంబర్లకు ఫోన్‌ చేయొచ్చు'' అన్నారు.

Labels: ,