20080306

498(ఎ) చట్టంలో మార్పులు తేవాలి

మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ రక్షణ చట్టాల దుర్వినియోగాన్ని ఖండిస్తూ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో సంస్థ ప్రతినిధులు చల్లా ఉమా, అనురాధ, విజయభారతితో పాటు పలువురు బాధితులు పాల్గొని దుర్వినియోగం అవుతున్న 498(ఎ) చట్టంలో వెంటనే మార్పులు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చట్టం పలువురు అమాయకులను నిర్బంధంలోకి తోసేస్తుందన్నారు. ఒక పురుషుడికి తల్లి, చెల్లి, అక్క, వదిన అయిన పుణ్యానికి 498(ఎ) చట్టం వల్ల అరెస్టు అవుతున్నారని  అన్నారు. నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా సదరు మహిళ ఇచ్చే ఫిర్యాదుతో కుటుంబసభ్యులు అరెస్టు కావాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఫిర్యాదుదారులు మాత్రమే మహిళలా? ఇతరులు కారా? అని ప్రశ్నించారు. ఈ చట్టం కింద ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళ అరెస్టు అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళల హక్కుల పరిరక్షణ పేరిట అమాయకుల మానవ హక్కులను ఉల్లఘించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 'వరకట్నం' పేరిట పెడుతున్న కేసుల వల్ల ఎన్నో జీవితాలు బలయ్యాయని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా 498(ఎ) చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీపుల్స్ గ్రీవెన్స్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్‌యాదవ్, బాధిత తల్లులు సరోజినీదేవి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొని మాట్లాడారు.

గంటపాటు విద్యుత్తు ఉపకరణాలకు స్వస్తి

విద్యుత్తు పొదుపుతో పాటు భూతాపానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా  ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అందరూ ఇళ్లల్లో ఉన్న విద్యుత్తు దీపాలు ఆర్పి ఉద్యమానికి చేయూతనివ్వాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాఘవేందర్ కోరుతున్నారు. ముంబయిలో డిసెంబర్ 15న నిర్వహించిన 'బత్తీ బంద్' కార్యక్రమమే తమకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు.  ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి నగరంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న యువత రాఘవేందర్, మోహన్, మధుకర్, రజిత, పుష్కర్, సంపత్, షవాలీ నడుం బిగించారు. వీరంతా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు. ఏదైనా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఉద్యమం. ఈ కార్యక్రమానికి గ్రేటర్ కమిషనర్ సీవీఎస్‌కే శర్మతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ, నెడ్‌క్యాప్ తదితర సంస్థలూ సహకరిస్తున్నాయి. వివరాలకు 99088 15490లో సంప్రదించవచ్చన్నారు.